రాష్ట్రంలో ఇప్పుడు బోలెడు రాజకీయ పార్టీలు హంగామా చేస్తున్నాయ్.. ఎవరిని ఎన్నుకోవాలో అర్థం కాని పరిస్థితి.. కాసేపు రోజు వారీ పనుల్ని పక్కన పెట్టి రాష్ట్ర భవిష్యత్తు, మన భవిష్యత్తు కోసం ఎవర్ని ఎన్నుకుందాం అని చూస్తే బోలెడన్ని సందేహాలు.. ఎవరి మీదా ఒక పట్టాన నమ్మకం కుదరని పరిస్థితి..
లోక్ సత్తా వాళ్ళు చెప్పేవన్నీ బానే వున్నాయ్.. ఎంతవరకి చేస్తారు అనేది మాత్రం చెప్పలేం.. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఎంతవరకి చేస్తారు అనటం కన్నా మనం వాళ్లకి ఎంతవరకి చేసే అవకాశం ఇవ్వగలం అనేదే ఇక్కడి ప్రశ్న.. వాళ్లకి స్పష్టమైన మెజారిటి వస్తే తప్ప వాళ్ళు ఈ ఐదు సంవత్సరాల్లో చేసేదేం లేదు.. మరి మనం వాళ్లకి ఆ అవకాశం ఇస్తున్నామా అంటే సమాధానం మాత్రం 'లేదు' మనం ఇవ్వం.. ఎందుకంటే ఒక్క సారి మన ఎన్నికల ఫలితాల సరళిని చూస్తె తెలుస్తూంది.. ఒక పార్టీ అద్యక్షున్ని చూసి రాష్ట్రమంతటా ఆ పార్టీకి అనుకూలం గా వోట్లు వేసే రోజులు స్వర్గీయ రామారావు తోనే అంతం అయ్యింది అని చెప్పవచ్చు.. ఇప్పుడు ఎక్కడికక్కడ లోకల్ నాయకులకి వున్న ఇమేజ్, వారి పనితనం, లోకల్ పాలిటిక్స్, అన్నిటి కన్నా ముఖ్యం గా కుల రాజకీయాలు ఎక్కువయ్యాయి.. పార్టీ లకి గాలి వీయడం అంటే ఆ పార్టీ కొన్ని ఎన్నికల్లో పాల్గొని పాత పార్టీ అన్నా కావలి.. లేక కొత్త పార్టీ అయితే దాని అద్యక్షుడు చిరంజీవి లాంటి గొప్ప ఫాలోయింగ్ ఉన్న వాడన్నా అయి వుండాలి.. జయ ప్రకాష్ కి ఫాలోయింగ్ పట్టణ ప్రాంత యువతలో కాస్త ఎక్కువే అయినా రాష్ట్రమంతటా ప్రభావితం చేసేటంత ప్రస్తుతానికి లేదని ఒప్పుకోవాలి.. ఈ సారికి కొన్ని సీట్లు గెలుచుకొని ప్రజల కోసం పోరాడనీయండి వచ్చే సారి చూద్దాం అనిపిస్తుంది..
ఇక పోతే ప్రజా రాజ్యం.. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని పార్టీల అద్యక్షులకన్న కనీసం రెండు రెట్లు వ్యక్తిగత ఫాలోయింగ్ వున్న వ్యక్తీ.. అది ఒక్కటి తప్పించి ఇంకా ఎందులోనూ ఈ రోజు వరకీ 'ఓహో! చాలా బాగుంది' అనిపించే నిర్ణయం గానీ, నడత గానీ కనిపించని పార్టీ.. మిగిలిన అన్ని పార్టీల్లోని సీట్లు అనుమానం గా వున్న నాయకుల కలబోత ప్రజా రాజ్యం.. కొత్తగా రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా కులం అంశం ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది అంటే దానికి కారణం నిస్సందేహంగా ప్రజా రాజ్యమే.. ఈ పార్టీ నాయకుడు ఏది అడిగినా 'తెలీదు' అని నిజాన్ని నిర్భయంగా ఒప్పుకుంటాడు.. ఆ వెంటనే అంతే నిర్భయంగా తెలియాల్సిన అవసరం ఏంటి అని మనల్నే ఎదురు ప్రశ్నిస్తాడు.. ఏత వాత నాకు ఒక్కటే తెలుసు ప్రజలకి సేవ చేయాలనే కోరిక అంటాడు.. ఎలా చేస్తావు అంటే, చేసేది వాళ్ళకి కాబట్టి వాళ్ళే చెప్పాలి అంటాడు.. మరి అది కూడా మనమే చేస్తే ఆ పార్టీ ఎందుకో అర్థం కాదు.. తెల్ల కాగితం ఇస్తాను మీకు కావాల్సింది రాసుకోండి అంటాడు.. ముసయిదాకి మ్యానిఫెస్టోకి కూడా తేడా తెలీదంట కదా అంటే అవును అంటాడు.. మరి రేపు ముఖ్యమంత్రి ని చేస్తే ఐదేళ్లూ అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పినట్లే అధ్యయనం చేస్తూ వున్నాం చేస్తూ వున్నాం అని కాలం గడిపెస్తారేమో.. ఈ లోపు వారి తమ్ములుంగారు తనకి గతంలో వ్యక్తిగత స్పర్ధలు వున్న దెక్కన్ క్రానికాల్ వంటి వారిని ఒక చూపు చూస్తాడేమో.. వారి కోర్ కమిటీ ఒకటి మాట్లాడుతుంటే అదే సమయమ్లో వాళ్ళ నాయకుడు ఇంకో టివి చానల్ వాళ్ళతో అదే విషయం పై ఇంకో రకమైన మాటలు మాట్లాడుతుంటారు.. అటు చేసి ఇటు చేసి ప్రజలని అయోమయమ్లో పెడతారు.. ఆర్నెల్లు కావస్తున్నా నేటికీ అదే తంతు..
టిడిపి వాళ్ళు తొమ్మిదేళ్ళు ఏలారు కాని ఈ రోజు మళ్ళీ గట్టిగా తనంత తానూ రెండు వందల తొంభై నాలుగు స్థానాల్లో నిలబడలేక పోటానికి కారణాలు ఏంటనేది వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోవాలి.. ఇప్పుడు అవసరం కోసం అక్కున చేర్చుకుంటున్న పార్టీలు అన్నీ రేపు అధికారం వస్తే టిడిపి వాళ్ళు చెప్తున్నవన్నీ చేయనిస్తారా, వాళ్ళ దాక ఎందుకు, ఒక్క సారి అధికారం లోకి వచ్చాక గెలిచిన వాళ్లంతా వాళ్ళ వాళ్ళ నియోజక వర్గాల వృద్ధి కై పని చేస్తారా లేక గత ఐదు సంవత్సరాలు గా అధికారానికి దూరం గా వుండటం వల్ల కోల్పోయినటువంటి వ్యాపార అవకాశాల్ని వెదుక్కొంటూ కాంట్రాక్టు లకై కొట్టుకుంటూ వుంటారా అనే అనుమానం..
ఇంకా మిగిలిన మహా అధ్బుతం మన కాంగ్రెస్ పార్టీ.. అందర్లోకీ 'లోక జ్ఞానం' లో వీళ్ళు కాస్త నయమని నేనంటాను, తప్పు అయితే సరిదిద్దండి.. ఎందుకని వీళ్ళకి లోక జ్ఞానం ఎక్కువ అని అడుగుతారా? అడగండి చెబుతా.. మన నాయకుల్లో టిడిపి కాని, పిఆర్పి కాని, లోక్ సత్తా గాని, ఆఖరుకి జాతీయ పార్టీలయిన ఎర్ర కామ్రేడ్లు గాని.. వీళ్ళల్లో ఎంతమందిని మనం 'ఢిల్లి' వెళుతూ వస్తూ వుంటే చూస్తున్నాం? కానీ మన కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ లేస్తే ఢిల్లి లో పాడుకుంటారు, ఢిల్లి లో లేస్తే మళ్ళీ రాత్రికి ఇక్కడ పడుకుంటారు.. ఎ నియోజక వర్గం ఎక్కడో కూడా తెలీని ఎవడో తెలుగు రాని వాడి, తెలుగు కాని వాడి గడ్డాలూ కాళ్ళూ పట్టుకొని తెలుగు రాష్ట్రంలో పోటీ చేసే అవకాశాన్ని ఢిల్లి లో కొనుక్కొని వస్తారు.. :) అటూ ఇటూ తిరిగిన జ్ఞానం, వాడి కాళ్ళూ వీడి కాళ్ళూ పట్టుకున్న జ్ఞానం.. ఇలా అపరిమితమయిన పరిజ్ఞానాన్ని కూడా గట్టుకొని వచ్చి, ఆ జ్ఞానాన్ని అంతా అమాయకులమైన మనపైన చూపించి మరో ఐదేళ్లూ మనకి ఐస్ క్రీంలు ఇచ్చి వాళ్ళు మాత్రం ఐస్వర్యవంతులు అవుతారు..
ఇప్పుడు చెప్పండి ఎవరికీ వేద్దాం మన వోటు? ఆలోచిస్తూ వుండండి.. ఈ లోపు నేను కాస్త అలా అలా వెళ్లి మన నాయకులు వోట్ల కోసం, సీట్ల కోసం పడుతున్న కుస్తీ పట్లు, పాట్లు వీక్షించి వస్తాను.. సెలవు..
For movie news and free telugu songs download, visit
anigalla.com.
thank you for visiting anigalla.net , you can leave a comment here about the article or contact us through our contact form - webmaster@anigalla.net ,
Share or Bookmark this post…